కోటీశ్వరుడి గొప్ప మనసు

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంపన్నులు ఉన్నారు. వారిలో చాలామంది తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవకు కేటాయిస్తున్నారు. పేద ప్రజల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారు.. ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారు. ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. కానీ.. ఓ సంపన్నుడు పరోక్షంగా ప్రజలకు మేలు కలిగే ఓ మహత్కార్యాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రపంచాన్ని కాలుష్యమయం చేస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని పారదోలే యజ్ఞాన్ని ప్రారంభించాడు.

షెల్లింగి రక్కె.. నార్వేకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. ఓడలు.. ఓడరేవులకు సంబంధించిన వ్యాపారాల్లో ఆయన వాటానే ఎక్కువగా ఉంటుంది. చేపలు పట్టే జాలరిగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనేక రకాల వ్యాపారాలు చేస్తూ.. రూ.వేల కోట్లకు పడగెలెత్తాడు. సముద్రం ఆయన జీవితంలో ఒక భాగం. అలాంటి సముద్రం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కలుషితమవుతుంటే.. తల్లడిల్లిపోయాడు. ఈ ప్లాస్టిక్‌ వల్ల సముద్రం కలుషితమవడమే కాకుండా.. పరోక్షంగా ప్రాణకోటికి నష్టం వాటిల్లే ప్రమాదముంది. అందుకే సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలని సంకల్పించుకున్నాడు.

ఇందుకోసం తనకున్న దాదాపు రూ. 17వేల కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టేందుకు ముందుకొచ్చాడు. నార్వేకి చెందిన వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ అనే సంస్థతో కలిసి సముద్రాన్ని శుభ్రపర్చేందుకు భారీ ఓడ(రీసెర్చ్‌ ఎక్సిపెడిషన్‌ వెసెల్‌) నిర్మించనున్నాడు.

ఇందులో 30 మంది సిబ్బంది.. 60మంది పరిశోధకులు.. శాస్త్రవేత్తలు ప్రయాణిస్తారట. ఈ ఓడ రోజుకు 5 టన్నుల ప్టాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి రిసైకిల్‌ చేస్తుందట. అంతేకాదు.. ఆసక్తి ఉన్న పరిశోధకుల్ని.. శాస్త్రవేత్తల్ని తన మహత్కార్యంలో భాగం కావాలని.. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని పిలుపునిస్తున్నాడు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *