ఆ మరుగుదొడ్డిని.. 1200 సీసాలతో కట్టా!

‘సమాజం మనకి ఎన్నో ఇస్తుంది. అలాంటప్పుడు మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలి కదా. అందుకే నాకు వచ్చిన చదువుతోనే సేవ చేయాలనుకున్నా..’ అంటోంది హైదరాబాద్‌కి చెందిన రష్మీ తివారి. ఆర్కిటెక్ట్‌ అయిన రష్మి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలతో మరుగుదొడ్లు కట్టడం మొదలుపెట్టింది. జీహెచ్‌ఎంసీ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించి.. ప్రభుత్వ పాఠశాలలూ, మురికివాడల్లో అలాంటివి కట్టమని కోరింది. అసలు రష్మికి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..

ఏడాది కిందట ‘ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌’ అనే సబ్జెక్టు తీసుకుని ఆర్కిటెక్చర్‌లో పీజీ చేశా. అలాగని నేనేమీ భవన నిర్మాణ రంగంలో, ఇంటీరియర్‌ డిజైనింగ్‌తో డబ్బులు సంపాదించాలనుకోలేదు. నా చదువుని సమాజం కోసం ఉపయోగించాలనుకున్నా. అందుకు ఏం చేయాలా అని ఆలోచించా. భవనాలు నిర్మించేటప్పుడు.. ఇతర రంగాల్లో ఏవి పర్యావరణానికి హాని చేస్తున్నాయా అని గమనించా. ప్లాస్టిక్‌ నా దృష్టికొచ్చింది. దాన్ని రెండుమూడు సార్ల కంటే ఎక్కువ రీసైకిల్‌ చేయడానికి లేదు. ఒక వేళ కాల్చేద్దామనుకుంటే వాటి నుంచి విడుదలయ్యే వాయువులు మరీ హానికరం. ఇవన్నీ గుర్తించాకే వాటితోనే ఏదయినా చేయాలనుకున్నా.

అధ్యయనం చేసి: ఇక రోడ్ల పక్కనా, కాలువల్లో, చెరువుల్లో.. ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ సీసాలూ, డబ్బాలు కనిపించేవి. వాటి గురించి అధ్యయనం చేస్తే ఒక్క సెకనుకు పదిహేను వందల నీళ్ల సీసాలను వాడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి వాటితోనే నిర్మాణాలు చేస్తే అని అనిపించింది. అలా కొన్ని నీళ్ల సీసాలను సేకరించి ఒక నమూనా తయారు చేశా. ఆ నీళ్ల సీసాలు అతుక్కోవడానికి బంకమట్టిని ఎంచుకున్నా. బయటవైపు సిమెంటుతో ప్లాస్టరింగ్‌ చేశా. ఈ ప్రయోగాలు విజయవంతంగా చేసి చూడటానికి నాకు రెండేళ్లు పట్టినా చివరకు ఫలితం కనిపించింది.

ప్రభుత్వ బడుల్లోనే: ఆ తరవాత చంపాపేటలోని సింగరేణి కాలనీలో మహిళలు మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడటం గమనించా. వాళ్లకూ నా గురించి తెలియడంతో ‘మాకోసం టాయిలెట్‌ కట్టించగలరా’ అని అడిగారు. కానీ అక్కడ కొన్ని సమస్యలుండటంతో పని మొదలుపెట్టలేకపోయా. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకి మరుగుదొడ్లు లేని విషయం నా దృష్టికొచ్చింది. రెండు నెలల కిందట లంగర్‌హౌస్‌లోని అంబేడ్కర్‌ ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణం మొదలుపెట్టా. అందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బషీరుద్దీన్‌ మాకు వెంటనే అనుమతి ఇప్పించారు. నీళ్ల సీసాలను డంప్‌యార్డుల్లో చెత్త ఏరే వారి దగ్గర్నుంచీ తీసుకున్నా. వాటి మధ్యలో బంక మట్టి పెట్టి.. అది ఎండిపోయాక సిమెంటూ, ఇసుకతో ప్లాస్టరింగ్‌ చేశా.

ఇందుకోసం పన్నెండు వందల నీళ్ల సీసాలు అవసరమయ్యాయి. వాటన్నింటినీ సేకరించా. నా స్నేహితులూ, ఆర్కిటెక్టులు రవిచంద్ర, ముజాహిద్దీన్‌ సాయంతో పదిరోజుల్లో దాన్ని పూర్తిచేశా. అయితే ఎండలకు బీటలు వారుతుందేమో అనుకున్నా కానీ.. నిర్మాణం చెక్కు చెదరలేదు. అంటే ఈ ప్రయోగం విజయం సాధించినట్టే అనిపించింది. ఇందుకోసం నాకు పద్దెనిమిది వేల రూపాయల ఖర్చు అయ్యింది. ప్రస్తుతం మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా నీళ్ల సీసాలతో మరుగుదొడ్లు కట్టే పనిలో ఉన్నా. నా గురించి తెలిసిన జీహెచ్‌ఎంసీ అధికారులు నన్ను పిలిచి అభినందించడమే కాదు.. వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు. ఇక మీదట మరిన్ని నిర్మాణాలు చేసే పనిలో ఉన్నా.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *