చిన్ని చేతులు అద్భుతాన్ని చేస్తున్నాయి

కాలుష్యం పెరిగి, పచ్చదనం తగ్గితే వాతావరణంలో వేడి పెరిగిపోతుంది. దాంతో భూమిపై ఉన్న మంచు కరిగి మనిషి మనుగడకే ప్రమాదం… ఇలా పర్యావరణం గురించి పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో బోధిస్తుంటారు ఉపాధ్యాయులు.
అందరూ వాటిని వింటారు. కానీ తొమ్మిదేళ్ల ఫిలిక్స్‌ ఫింక్‌ బైనర్‌ మాత్రం విని వూరుకోలేదు. ఓ హరిత ఉద్యమానికి నాంది పలికాడు. అతడు స్థాపించిన సంస్థ ద్వారా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల మొక్కల్ని నాటాడు. ఆ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.
సంవత్సరం 2007. స్థలం జర్మనీలోని మ్యూనిక్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాల. వాతావరణం వేడిగా ఉండడంతో నాలుగో తరగతి గదిలో ఉపాధ్యాయుడు పిల్లలకు భూతాపం గురించి వివరించడం మొదలుపెట్టారు. వాహనాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలూ ఇతర కర్మాగారాల వల్ల విడుదలవుతున్న కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తోందో ప్రపంచానికి ఎంతటి ముప్పును తెస్తోందో తెలిపారు. ఆ విషయాన్ని మరింత సమగ్రంగా తెలుసుకుని విద్యార్థులు పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పారు. దాంతో ఫిలిక్స్‌ భూతాపం గురించి ఇంటర్నెట్‌లో శోధించగా కాలుష్యం వల్ల జీవజాతులకు కలుగుతున్న నష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థమైంది. అప్పుడే కెన్యాకు చెందిన ‘వంగారి మాతై’ అనే ఆమె నడిపిస్తున్న ‘గ్రీన్‌ బెల్ట్‌ మూవ్‌మెంట్‌’ గురించి తెలుసుకున్నాడు. ఆమె ముప్పయ్యేళ్లపాటు శ్రమించి ఆఫ్రికా మొత్తమ్మీదా మూడు కోట్ల మొక్కల్ని నాటించింది. అందుకుగానూ నోబెల్‌ బహుమతిని సైతం అందుకుంది. ఇలాంటి విషయాలెన్నో ప్రస్తావిస్తూ పచ్చదనం పర్యావరణానికి చేసే మేలు గురించి పాఠశాలలో ప్రెజెంటేషన్‌ ఇచ్చాడు. అంతేకాదు, మాతై స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరూ కలిస్తే ఒక్కో దేశంలో కోటి మొక్కల్ని నాటొచ్చని తన ఆలోచనను చెప్పాడు. ఆ కుర్రాడి మాటలు ఉపాధ్యాయుడినీ ఆలోచింపచేశాయి. అతడిని జర్మనీలోని మరిన్ని పాఠశాలల్లోనూ వేదికలపై మాట్లాడమని ప్రోత్సహించాడు. అన్నిచోట్లా మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఫిలిక్స్‌ 2007 మార్చిలో ‘ప్లాంట్‌ ఫర్‌ ది ప్లానెట్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. ‘మాటలు ఆపు… మొక్కలు నాటు…’ అన్నది దీని నినాదం. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరు వేరు పట్టణాల్లో క్లబ్‌లని ఏర్పాటు చేసి బాలల్ని సభ్యులుగా చేర్చుకుంటారు. వాళ్లు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలతో కలసి మొక్కల్ని నాటుతారు.

ఏడాదిలో పదిలక్షల మొక్కలు
ఏడాది తిరిగే సరికి జర్మనీలోని వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు సంస్థలో సభ్యులుగా చేరి, చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షాయాభైవేల మొక్కల్ని నాటారు. ఆ విజయంతో 2008 సంవత్సరంలో నార్వేలో జరిగిన యునిసెఫ్‌ బాలల సదస్సుకు హాజరవమని ఫిలిక్స్‌కు ఆహ్వానం అందింది. భూతాపాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత గురించి అక్కడ అతడు మాట్లాడిన తీరు మరింతమందిని ఆకర్షించింది. ఫలితం… ఫిలిక్స్‌ ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) జూనియర్‌ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యాడు. దాంతో ‘ప్లాంట్‌ ఫర్‌ ది ప్లానెట్‌’ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. తర్వాత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన యునిసెఫ్‌ సదస్సులోనూ పాల్గొన్న ఫిలిక్స్‌… మొక్కలు నాటేందుకు అక్కడికొచ్చిన వివిధ దేశాల విద్యార్థుల మద్దతునూ కూడగట్టగలిగాడు. మరో రెండేళ్లలో అతడు 93 దేశాల్లోని పాఠశాలల విద్యార్థుల్ని సంస్థలో భాగస్వాములుగా చేసి ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల మొక్కల్ని నాటించాడు. దాంతో సంస్థకు విరాళాలు వెల్లువెత్తాయి.

ప్లాంట్‌ ఫర్‌ ది ప్లానెట్‌ గ్లోబల్‌ బోర్డు సభ్యులు వేరు వేరు దేశాలూ ప్రాంతాలకు తిరిగి పాఠశాలల్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనికి హాజరైన సభ్యులందరూ క్లైమెట్‌ జస్టిస్‌ అంబాసిడర్లు అవుతారు. వాళ్లు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారినీ హరిత ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ సభ్యులూ అంబాసిడర్లందరూ కలసి ఆన్‌లైన్‌ ద్వారా గ్లోబల్‌ బోర్డును ఎన్నుకుంటారు. దీన్లో 14 మంది బాలలూ 14 మంది యువకులూ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతల్ని అమెరికాకు చెందిన ఐజాక్‌, భారత్‌కు చెందిన యుగ్‌రత్నలకు అప్పగించాడు ఫిలిక్స్‌. ఇప్పటికే 55 వేలమందికి పైగా చిన్నారులు ఇందులో అంబాసిడర్లుగా ఉన్నారు.

భారత్‌లోనూ…
ఫిలిక్స్‌ పచ్చదనం యజ్ఞం భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించింది. అనంతపురం జిల్లాలోని ‘రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)’తో కలసి పనిచేసేందుకు అతడు 2015లో ఇక్కడికీ వచ్చాడు. స్థానిక ఆర్డీటీ పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో కలిసి చుట్టుపక్కల మొక్కలు నాటాడు. అతడి స్ఫూర్తితో ఆర్డీటీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోనూ మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపడుతోంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలోనూ స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తోంది ప్లాంట్‌ ఫర్‌ ది ప్లానెట్‌. ఇలా మనదేశంలోనే ఇప్పటి వరకూ కొన్ని కోట్ల మొక్కల్ని నాటించింది. ఐక్యరాజ్యసమితి బిలియన్‌ ట్రీ క్యాంపెయిన్‌ బాధ్యతనూ ఈ సంస్థకే అప్పగించింది. ఇందులో భాగంగా 130 దేశాల్లో ఇప్పటికే 1400 కోట్ల మొక్కల్ని నాటారు. ‘ప్రస్తుతం భూమ్మీద విడుదలవుతున్న కార్బన్‌డయాక్సైడ్‌ మొత్తాన్నీ పీల్చుకోవడానికి కనీసం మనిషికి 150 చెట్లు ఉండాలి. అందుకే, భవిష్యత్తు తరాల కోసం లక్ష కోట్ల మొక్కల్ని నాటడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం’ అంటాడు 19 ఏళ్ల ఫిలిక్స్‌. చిన్నవయసులో అతడు చేస్తున్న ఈ గొప్ప పని కొరియా విద్యార్థులకు పాఠ్యాంశంగానూ మారింది.

హ్యాట్సాఫ్‌ ఫిలిక్స్‌..!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *