ఎక్కడి చెత్త అక్కడే మాయం

బహుళ అంతస్తుల భవనాల వద్దే జీవ ఇంధనం తయారీ!
సత్ఫలితాలిస్తున్న ఐఐసీటీ శాస్త్రవేత ప్రయోగం
హైదరాబాద్‌లో అమలుచేస్తే ప్రజాధనం భారీగా ఆదా

హైదరాబాద్‌ మహానగరంలో ఒక్కరోజు పోగయ్యే చెత్త సుమారు 4 వేల టన్నులు. దీన్ని శివారులోని జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలించడానికి ఏటా అయ్యే ఖర్చు దాదాపు రూ.200 కోట్లు. ఆ యార్డు నిండిపోతే, మరో ప్రాంతాన్ని వెతికి చెత్తతో నింపాల్సిందే. అలా కాకుండా, ఎక్కడి చెత్తను అక్కడ మాయం చేస్తే? ఇది కచ్చితంగా సాధ్యమని నిరూపిస్తున్నారు… భారత రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు. తక్కువ వ్యయంతో బహుళ అంతస్తుల భవనాల వద్ద వ్యర్థాలతో జీవ ఇంధనం (బయోగ్యాస్‌) తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఈ విధానం ఇప్పటికే కేరళలోని కొచ్చిలో విజయవంతంగా అమలవుతోంది.

జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో చెత్తను శుద్ధిచేసే విధానం ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే, వ్యర్థాలను తరలించే పనిలేకుండా, ఎక్కడికక్కడే సులువుగా శుద్ధి చేయడమే కాకుండా, ఇంధనంగానూ మార్చుకోవచ్చంటున్నారు ఐఐసీటీ ముఖ్య శాస్త్రవేత్త జానీ జోసెఫ్‌. బయోడైజెస్టర్‌ విధానం కింద ఆయన రూపొందించిన ట్రాష్‌గార్డ్‌ యంత్రాన్ని 2014లో తొలిసారిగా కొచ్చిలో అమర్చారు. సత్ఫలితాలిస్తుండటంతో ప్రస్తుతం 20 అపార్టుమెంట్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. వంటగదుల్లో ఉత్పత్తయ్యే సేంద్రీయ వ్యర్థాల్ని (తడిచెత్తను) ఈ పరికరంలో వేస్తే, అవి పూర్తిగా దహనమై బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. గతంలో గ్రామాల్లో గోబర్‌గ్యాస్‌ను వినియోగించే సంప్రదాయం ఉండేది. ఇనార్బిక్‌ బ్యాక్టీరియాను తప్పనిసరిగా కలపాల్సి రావడంవల్ల దానికి ఆదరణ లేకపోయింది. అయితే.. ఆస్ట్రియా టెక్నాలజీ కారణంగా ట్రాష్‌గార్డ్‌ ఒత్తిడి ఆధారంగా దానంతట అదే పనిచేస్తుంది. ఈ యంత్రానికి రోజూ 50-100 కిలోల చెత్తను బయోగ్యాస్‌గా మార్చే సామర్థ్యముంటుంది. అపార్టుమెంట్లు, మార్కెట్‌యార్డులు, పశువధశాలలు, రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.

కేరళ ఉత్పాతం నేపథ్యంలో రూపకల్పన
జోసెఫ్‌ది కొచ్చి. 2007లో కేరళను గన్యా, ర్యాట్‌ ఫీవర్‌, డెంగీ తదితర వ్యాధులు చుట్టుముట్టాయి. దీంతో కేరళ ప్రభుత్వం రహదారులపై సీసీ కెమెరాల్ని ఏర్పాటుచేసి, చెత్తను బహిరంగంగా పాడేస్తే రూ.5 వేల చొప్పున జరిమానా విధించేది. మరోవైపు కాలనీల్లో బయోబిన్‌ (చెత్తడబ్బా)లను ఏర్పాటుచేసింది. కానీ, అక్కడ శాఖాహారులు ఎక్కువ. పైగా చేపలను ఎక్కువగా తింటారు. ఈ వ్యర్థాల కారణంగా బొద్దింకల సమస్య తలెత్తడంతో బయోబిన్‌ల వ్యవస్థ సత్ఫలివ్వలేదు. దీంతో జోసెఫ్‌ బయోడైజెస్టర్‌ యంత్రం రూపకల్పనపై దృష్టి సారించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న బయోమెథనేషన్‌ ప్లాంటుకు మరింత సాంకేతికతను జోడించి ట్రాష్‌గార్డును అందుబాటులోకి తెచ్చారు. కొచ్చితోపాటు బెంగళూరు, గుజరాత్‌, నాగ్‌పూర్‌ తదితర నగరాల్లో దీని వినియోగంపై కసరత్తు జరుగుతోంది.

సాంకేతికతను అందిస్తాం
కేరళలో ఉపద్రవం సంభవించినప్పుడు తక్కువ ఖర్చుతో చెత్తను బయోగ్యాస్‌గా మార్చే ఆలోచనతో ట్రాష్‌గార్డ్‌ను రూపొందించాం. ప్రభుత్వం చొరవ తీసుకుని హైదరాబాద్‌లాంటి నగరాల్లో వీటిని ఏర్పాటుచేస్తే… చెత్త రవాణా ఖర్చు ఉండదు. డంప్‌యార్డుల్లో వ్యర్థాలూ పేరుకుపోవు. ట్రాష్‌గార్డ్‌ల కోసం రామగుండం తదితర పురపాలక సంఘాలు, కొన్ని వ్యాపార సంస్థలు సంప్రదించాయి. ముందుకొచ్చేవారికి ఐఐసీటీ ఈ సాంకేతికను అందిస్తుంది.

– జానీ జోసెఫ్‌, ఐఐసీటీ ముఖ్య శాస్త్రవేత్త

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *