తడి, పొడి వేరు చేస్తే… రూ.1,00,000

‘తడి చెత్త.. పొడి చెత్తను వేరు చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి’ అంటూ గృహిణులకు బల్దియా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. లాటరీ పద్ధతిలో ప్రతి నెలా ఒక్కో గృహిణిని ఎంపిక చేసి.. ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది.

నగరవాసుల్లో చాలామందికి అవగాహన లేక తడి, పొడి చెత్తను ఒకే దగ్గర కలిపేస్తున్నారు. అలా కాకుండా వేరు చేస్తే 75 శాతం చెత్తను పునర్వినియోగించుకునేందుకు అవకాశముంది. ఇదే అంశంపై ప్రజల్ని చైతన్యం చేసేందుకు బల్దియా కృషి చేస్తోంది. అందులో భాగంగానే తడి, పొడి చెత్తను వేసేందుకు రెండు డస్ట్‌ బిన్‌లను ప్రతి ఇంటికి అందించింది. చెత్త సేకరణకు రెండు వేల స్వచ్ఛ ట్రాలీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీసీ, గోద్రెజ్‌ తదితర

కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలతో కలిసి నగరవాసులకు అవగాహన కల్పిస్తోంది. సేకరించిన చెత్తను నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు డ్రై రిసోర్స్‌ సెంటర్లను నిర్వహిస్తోంది. ఇటీవల కేంద్రం బల్దియా మాదిరిగానే తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు చెత్త కుండీలను అందించాలని అన్ని మున్సిపాలిటీలను ఆదేశించింది. ఇలాంటి తరుణంలోనే మరింత పక్కాగా ముందుకెళ్లాలని బల్దియా నిర్ణయించింది. గృహిణులను భాగస్వామ్యం చేస్తే వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావిస్తోంది.

ప్రస్తుతం తడి, పొడి చెత్తను వేరు చేసి జీహెచ్‌ఎంసీ గార్బేజ్‌ కలెక్టర్లకు అందిస్తున్న గృహిణులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రతి నెలా ఒక్కొక్కరికీ రూ.లక్ష బహుమతిని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇందుకు తడి, పొడి చెత్తను ఎన్ని రోజుల నుంచి వేరు చేస్తున్నారు.. అలా వేరు చేసిన దాన్ని ఎవరికి అందిస్తున్నారు… తదితర వివరాలతో జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకోవాలి. అలా వచ్చిన దరఖాస్తుల్లో ప్రతి నెలా లాటరీ పద్ధతిలో ఒకరిని ఎంపిక చేసి రూ.లక్ష అందించనున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *