‘365 అన్‌ప్యాక్‌డ్‌’.. ఫొటోలు చూస్తారా..!

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాల సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతోంది. వీటి నివారణకు కొన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు మాత్రం పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. ఈ వ్యర్థాల వల్ల పర్యావరణం పాడవుతుందని.. దీని మూలంగా భవిష్యత్‌తరాలకు ఇబ్బందులు తప్పవని పర్యావరణ వేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ప్రజల్లో మార్పు వస్తే తప్ప అలాంటి వ్యర్థాల నివారణ సాధ్యం కాదని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రాన్స్‌కి చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ వినూత్న ప్రయత్నం చేశారు.

ఆంటోనీ రెపెస్సీ అనే ఫొటోగ్రాఫర్‌ నాలుగేళ్లుగా రీసైకిల్‌ వ్యర్థాలను బయట వేయకుండా తన ఇంట్లోనే దాచుకున్నాడు. ఒక వ్యక్తి కారణంగా దీర్ఘకాలంలో ఏ స్థాయిలో రీసైకిల్‌ వ్యర్థాలు పేరుకుపోతాయో చూడాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అలా ఆ వ్యర్థాలను ఇంట్లోనే ఉంచేయడంతో నాలుగేళ్లు పూర్తయ్యేసరికి ఇంట్లో ఎక్కడా చిన్నపాటి ఖాళీస్థలం కూడా మిగల్లేదట. నాలుగేళ్లలో 1600 వాటర్‌ బాటిళ్లు, 4,800 టాయ్‌లెట్‌ రోల్స్‌, 800కిలోల న్యూస్‌పేపర్లతో పాటు చాలా వ్యర్థాలు పోగయ్యాయి.

నాలుగేళ్లుగా తన ఇంట్లో పేరుకుపోయిన చెత్తను బయట వేసేముందు రీసైకిల్‌ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘365 అన్‌ప్యాక్‌డ్‌’ పేరుతో ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఒక మంచి విషయాన్ని టన్నుల కొద్దీ పదాలు వాడి మాటల్లో చెప్పే కంటే.. చెప్పాల్సిన సందేశాన్ని దృశ్య రూపంలో తెలియజేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని భావించాడు. దానికి అనుగుణంగా నాలుగేళ్లుగా పేరుకుపోయిన వివిధ రకాల వ్యర్థాలు కనిపించే విధంగా ‘365 అన్‌ప్యాక్‌డ్‌’ పేరిట ఫొటో సిరీస్‌ చేశాడు. చుట్టూ ఉన్న రీసైకిల్‌ వ్యర్థాలు మధ్యలో ఒకరిద్దరు మనుషులను పెట్టి ఫొటోలు తీశాడు. ఆంటోనీ స్వతహాగా ఫొటోగ్రాఫర్‌ కావడంతో మరింత ప్రభావవంతంగా వాటిని చిత్రీకరించాడు.

రీసైకిల్‌ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంటోనీ చేసిన ప్రయత్నాన్ని అంతా అభినందిస్తున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *