ప్లాస్టిక్‌ వ్యర్ధాలు కిలో రూ.20

ప్రజలకు ‘బంపర్‌ ఆఫర్‌’ ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం
రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు

 గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నిరోధించేందుకు రాష్ట్రంలోని రెండు మండలాల్లో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనిలోభాగంగా ప్రజల నుంచి కిలో రూ.20 ధరకు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను కొనుగోలు చేయనుంది. అనంతరం వీటిని చిన్నపాటి ముక్కలు చేశాక కిలో రూ.50 ధరకు పంచాయతీరాజ్‌ శాఖకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆపై దశల వారీగా అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్లాస్టిక్‌ వ్యర్ధాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపనుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా కంకిపాడు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 60 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను ముక్కలుగా చేసే రెండు ప్లాస్టిక్‌ కటింగ్‌ యంత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గంటకు 200 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ముక్కలుగా చేసే సామర్ధ్యం కలిగిన ఒక్కో యంత్రం కోసం రోజూ టన్ను నుంచి టన్నున్నర వ్యర్ధాలు అవసరం. ఇందుకుగాను కంకిపాడు నుంచి గుడివాడ మధ్య 25 పంచాయతీల్లో, శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట మధ్య 20 పంచాయతీల నుంచి వ్యర్ధాలను సేకరించనున్నారు.

రోడ్లపై ప్రజలు పారవేసే ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలు, పాలిథిన్‌ కవర్లు, ఇతర ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సిబ్బంది రోజూ సేకరించి కేంద్రాలకు తరలించాలి. ప్రజలు వీటిని నేరుగా తీసుకొస్తే కిలో రూ.20 ధరకు పంచాయతీ కార్యదర్శులు కొనుగోలు చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యర్ధాలను కటింగ్‌ కేంద్రాలకు తెచ్చిన పంచాయతీలకు ప్రభుత్వం తరఫున కిలోకు రూ.30 చొప్పున చెల్లించనున్నారు. ముక్కలుగా చేసిన ప్లాస్టిక్‌ వ్యర్ధాలను రహదారుల నిర్మాణం కోసం కొనుగోలు చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ సన్నద్ధమవుతోంది. తారులో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు కలిపి రహదారులు వేసే ప్రయోగం కొన్ని జిల్లాల్లో విజయవంతం కావడంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అమలు చేయాలని ఆయా వర్గాలు నిర్ణయించాయి. కిలో మీటర్‌ రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగించే తారులో 800 నుంచి 900 కిలోల ప్లాస్టిక్‌ ముక్కలు ఉపయోగించనున్నారు. వీటిని కిలో రూ.50 ధరకు కొనుగోలు చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ సంప్రదింపులు చేస్తోంది. రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ ఇలాంటి ప్లాస్టిక్‌ కటింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసే యోచనతో ప్రభుత్వం ఉంది. ఒక్కో యంత్రం కోసం రూ.2 లక్షలు వ్యయమవుతుందని, ఈ ప్రయోగంతో గ్రామాల్లో ప్టాస్టిక్‌ వ్యర్ధాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *