ఒక్క అడుగు… తీరాన్ని తీర్చిదిద్దే దిశగా..!

ఒక్క అడుగు… పరిశుభ్రతవైపు… అనేది ప్రభుత్వ నినాదం. కానీ తన సొంత ఆలోచనలతో వేల అడుగుల్ని పరిశుభ్రత దిశగా నడిపించాడు ముంబయికి చెందిన అఫ్రోజ్‌ షా. ఏళ్లతరబడి వ్యర్థాల గుట్టగా ఉన్న అక్కడి రెండున్నర కిలోమీటర్ల పొడవైన బీచ్‌ను ఆహ్లాదకరంగా మార్చేశాడు. ఇటీవలే ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావించిన ఈ ముందడుగు గురించి తెలుసుకోవలసిన స్ఫూర్తిదాయక విషయాలెన్నో ఉన్నాయి.

మన్‌కీ బాత్‌… ప్రధానమంత్రి తన ఆలోచనలనూ, తన దృష్టికి వచ్చిన వివిధ అంశాలనూ ప్రజలతో పంచుకుంటున్న అశేష ప్రజాదరణ చూరగొన్న కార్యక్రమం. ఈమధ్య ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ‘మీరంతా ముంబయిలోని వెర్సోవా బీచ్‌ గురించి వినే ఉంటారు. ఒకప్పుడు వ్యర్థాలకు చిరునామాగా ఉండే ఆ చోటు ఇప్పుడు ఎంతో అందంగా, పరిశుభ్రంగా తయారయింది. జనం 70, 80 వారాలు కష్టపడి వేల టన్నుల చెత్తను ఇక్కడి నుంచి తొలగించి ఈ మార్పును తేగలిగారు. ఈ కార్యక్రమాన్ని వెర్సోవా రెసిడెన్స్‌ వలంటీర్లు విజయవంతం చేశారు. అఫ్రోజ్‌షా అనే వ్యక్తి ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 2015లో ప్రారంభించి, అంకితభావంతో పనిచేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా పెద్ద సంఖ్యలో జనం ఆయనతో కలవడంతో ఇదో ప్రజాఉద్యమంగా మారింది’ అన్నారు. ప్రధానిని అంతగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమమేంటన్నదే ఇక్కడి విషయం.

అలా మొదలైంది…
సముద్రం అనగానే, చల్లనిగాలి, కాళ్లకింద మెత్తగా తాకే ఇసుక, విశాల సాగర సౌందర్యం…ఇలాంటివే గుర్తొస్తాయి. ముంబయిలోని వెర్సోవా బీచ్‌కు దగ్గర్లోని ఇంట్లోకి మారిన అక్కడి హైకోర్టులో లాయరుగా పనిచేసే అఫ్రోజ్‌షాకు కూడా ఇలాంటి వూహలే ఉండేవి. అందులోనూ అఫ్రోజ్‌ సముద్ర ప్రేమికుడు. అందుకే ఉదయపు నడక కోసం బీచ్‌కు వెళ్లాడు. కానీ అతనికక్కడ అందమైన తీరానికి బదులు వ్యర్థాల గుట్ట కనిపించింది. సన్నటి ఇసుకకు బదులుగా ప్లాస్టిక్‌ ముక్కలు కాలికి తగిలాయి. ఇది చూసి అతనెంతో బాధపడ్డాడు. తన వంతుగా ఏదో చేయాలనుకున్నాడు. మర్నాడు అఫ్రోజ్‌షా తన ఇంటిపక్కనే ఉండే 84 ఏళ్ల హర్బాన్ష్‌ మాధుర్‌తో కలిసి బీచ్‌కు వెళ్లాడు. ప్లాస్టిక్‌ ముక్కలు, గాజు సీసాలు, చిరిగిన వస్త్రాలు, చెప్పులు ఇలా కనిపించిన చెత్తనంతా ఇద్దరూ కలిసి ఓపిక ఉన్నంత సేపు బస్తాల్లోకి ఎత్తారు. దగ్గర్లో చెత్త పారబోసే ప్రాంతంలో ఈ వ్యర్థాల్ని పడేశారు. అలా మరో వారమూ సాగింది. మళ్లీ వారం, ఇంకో వారం, అలా 2015 అక్టోబరులో మొదలైన ఆ పని 85 వారాల పాటు సాగింది. అంటే ఏడాదిన్నరకు పైనే. ఇద్దరుగా మొదలైన ఈ పనిలో ప్రస్తుతం ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా విద్యార్థులూ, రాజకీయనాయకులూ, బాలీవుడ్‌ స్టార్లూ, పోలీసులూ, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులూ, మత్య్సకారులూ… ఇలా వివిధ రంగాల్లోని వేల మంది భాగస్వాములయ్యారు. 5500 టన్నులకు పైగా వ్యర్థాల్ని తొలగించి ప్రపంచ దేశాలకు ఆదర్శమయ్యారు.

ఒక్కొక్కరుగా…
మొదట్లో అఫ్రోజ్‌ బీచ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు అటుగా వచ్చిన కొందరు సాయపడుతుండేవారు. ఇంకొందరు పెద్దగా స్పందించేవారు కాదు. కానీ అఫ్రోజ్‌ మాత్రం బీచ్‌ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి తనతో కలిసి బీచ్‌ను బాగుచేయడానికి రమ్మని పిలిచేవాడు. కొందరు స్పందించేవారు. కొందరు పిచ్చి పని, అనేవాళ్లు. కానీ అఫ్రోజ్‌ మాత్రం ఈ పని పూర్తయ్యేదాకా నిద్రపోకూడదు అనుకున్నాడు. అందుకే ప్రతి శని, ఆదివారాల్లో తనతో వచ్చిన వాళ్లతో కలిసి ఈ పని చేస్తూనే ఉండేవాడు. అలా ‘వెర్సోవా రెసిడెంట్‌ వాలంటీర్స్‌’ అనే బృందం ఏర్పడింది. పదుల్లో ఉన్న సంఖ్య కాస్తా నెమ్మదిగా వందల్లోకి మారింది. మొత్తం ఓ సైన్యంలా పనిచేయడం మొదలు పెట్టారు. ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ పనికోసం చెత్తను తీసే మనుషులతో పాటూ, చెత్త బండ్లూ, ప్రొక్లెయినర్లను పంపింది. ఈ కార్యక్రమం ఐక్యరాజ్య సమితి దృష్టినీ ఆకర్షించింది. వాళ్ల పర్యావరణ విభాగం దీన్ని ప్రపంచంలోనే ‘అతిపెద్ద తీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమం’గా పేర్కొంది. అంతేకాదు వాళ్ల ప్రతినిధుల్నీ ఇక్కడికి పంపింది. తర్వాత 2016 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఎర్త్‌’ను అఫ్రోజ్‌కు ప్రదానం చేశారు. భారతదేశంలో ఈ అవార్డును అందుకున్న తొలివ్యక్తి ఇతనే.

మరిన్ని చోట్ల…
ఫిబ్రవరి 2017లో వెర్సోవా బీచ్‌ శుభ్రతా స్ఫూర్తితో ఐక్యరాజ్య సమితి ‘క్లీన్‌ సీస్‌’ కార్యక్రమాన్ని ఇండోనేషియాలో ప్రారంభించింది. తర్వాత ఉత్తర దక్షిణ ఆఫ్రికాలూ, ఎమెన్‌ సహా ఆగ్నేయాసియాలోని పలు దేశాలు ఈ బాటలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ముంబైలోని వివిధ బీచ్‌లు సహా చెన్నై విశాఖపట్టణాల్లోనూ ప్రారంభిస్తున్నారు. ‘మా కార్యక్రమాన్ని ప్రధాని మెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వెర్సోవా బీచ్‌ అందంగా మారడం ఆనందమే. కానీ పెద్ద అలలు వచ్చినప్పుడల్లా చెత్త పేరుకుపోతూ ఉంటుంది. దీన్ని శుభ్రం చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరగాలి. దాని కోసం మా వలంటీర్లు పనిచేస్తూనే ఉంటారు. సముద్రతీరం చెత్తకుప్పగా మారడం వల్ల అందులోని జంతుజాలానికి ఎంత నష్టమో మేం ఇక్కడి మత్య్సకారులకు వివరించాం. ఇప్పుడు ఎవరైనా ఈ ప్రాంతంలో చెత్త వేయబోయినా వాళ్లు వూరుకోవడం లేదు. భారతదేశంలోని అన్ని తీరాల్నీ అందంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ అని చెబుతాడు అఫ్రోజ్‌. మంచివైపుగా పడే ఒక్క అడుగు వేల అడుగుల్ని జతచేస్తుందనడానికి ఈ విజయం ఓ చక్కని ఉదాహరణ కదూ!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *